వెన్నెల జీవితంలో వెలుగులు నింపిన ఎమ్మెల్సీ భూపతి రెడ్డి

     Written by : smtv Desk | Sat, Dec 16, 2017, 07:46 PM

నిజామాబాద్, డిసెంబర్ 16: పుట్టుక తోనే బిడ్డ మూగ, చెవుడు అని తెలిసి ఆ దంపతుల గుండె తరుక్కుపోయింది. బిడ్డ పుట్టిందని సంతోషించాలా? మూగ, చెవుడు లోపం ఉందని బాధపడాలా? అని ఆ దంపతులు తీవ్ర మనస్తాపం చెందారు.

వివరాల్లోకి వెళితే... జిల్లాలోని ధర్పల్లి మండలానికి చెందిన రజిని-ప్రభాకర్ దంపతులకు జన్మించిన వెన్నెలకు పుట్టుకతోనే మూగ, చెవుడు ఉంది. దీంతో ఆ తల్లి తండ్రులు చేయని ప్రయత్నం అంటూ లేదు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులను ఎదుర్కొన్న, గుండె నిబ్బరం చేసుకొని తమ కుమార్తెకు మాత్రం చికిత్స చేయిస్తూ వచ్చారు.

పాపకి శస్త్రచికిత్స చేయిస్తే లోపం పోతుందని వైద్యులు సూచించడంతో ముందడుగు వేసారు. కానీ, అది ఓ సామాన్య మధ్య తరగతి కుటుంబానికి చెందిన తమతో సాధ్యం కాదని తెలిసి కన్నీటి పర్యంతమయ్యారు.

అలాంటి సమయంలో తన స్నేహితురాలి బాధను తెలుసుకున్న రేకులపల్లి వీణా రాణి - కిషన్ గౌడ్ దంపతులు, ఈ విషయాన్ని స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్సీ డా. ఆర్. భూపతి రెడ్డి దృష్టికి తీసుకెళ్ళి, వెన్నెల శస్త్రచికిత్సకు సహాయం చేయాలని కోరారు. ఈ విషయంపై వెంటనే స్పందించిన ఎమ్మెల్సీ భూపతి రెడ్డి ముంబాయికి చెందిన "అలీ అవర్ జంగ్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్ డిజిబిలిటిస్" సంస్థ ద్వారా చికిత్సకు అవసరమయ్యే విధంగా కృషి చేసి తన దయాగుణాన్ని చాటుకున్నారు.

అలాగే ఆపరేషన్ కు సంబంధించిన పత్రాలను ఈ రోజు వెన్నెల తల్లిదండ్రులకు అందజేశారు. మరో రెండు రోజుల్లో వెన్నెలకు హైదరాబాద్ లోని బంజరాహిల్స్ లో గల అపోలో ఆసుపత్రిలో చికిత్స చేయనున్నారు. ఈ మేరకు కృషి చేసిన ఎమ్మెల్సీ భూపతి రెడ్డికి వెన్నెల తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. అయన కృషికి స్థానిక నేతలు సైతం హర్షం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకు వచ్చినందుకు గాను రేకులపల్లి వీణా రాణి - కిషన్ గౌడ్ దంపతులను భూపతి రెడ్డి అభినందించారు.

Untitled Document
Advertisements